సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు కేసులో ఫిబ్రవరి 07 న ఒంగోలు రూరల్ పోలీస్‌స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. ఉదయం నుంచి రాత్రి వరకు పోలీసులు వర్మను విచారించి 50 ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. అయితే కొన్ని ప్రశ్నలకు “నాకు గుర్తు లేదు”, “తెలియదు” అంటూ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలీసుల నుంచి మరింత సమయం ఇచ్చినా, RGV సరైన సమాధానం చెప్పలేకపోయారు. చివరికి, పోలీసులు స్టేట్‌మెంట్ నమోదు చేసి, మరోసారి విచారణకు హాజరయ్యేందుకు ఆదేశించారు.
ఇదిలా ఉండగా, విచారణ ముగిసిన వెంటనే గుంటూరు పోలీసులు వర్మకు మరో షాక్ ఇచ్చారు. 2019లో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే RGV సినిమా కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. నవంబర్ 29న CID కార్యాలయంలో ఈ ఫిర్యాదు నమోదు కాగా, తాజాగా గుంటూరు సీఐ తిరుమలరావు మరోసారి వర్మకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఫిబ్రవరి 10 న గుంటూరు CID కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
ఇదంతా ముగిసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. సోషల్ మీడియా లో “నాకు ఒంగోలు అంటే చాలా ఇష్టం. ఒంగోలు పోలీసులు అంత కన్నా ఇష్టం. ఛీర్స్” అంటూ వర్మ పోస్ట్ చేశారు. దీంతో పాటు వైన్ గ్లాస్ ఎమోజీలు కూడా జోడించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ కేసు మరిన్ని మలుపులు తిరగనున్నట్లు కనిపిస్తోంది. రామ్ గోపాల్ వర్మ పై పోలీసులు తీసుకోబోయే తదుపరి చర్యలపై సినీ పరిశ్రమతో పాటు సామాజిక వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.